అశోకచక్రం ప్రదర్శనకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

  • వారణాసిలోని ఒక కూడలిలో ఏర్పాటు చేసిన అశోకచక్రంను ఉదహరించిన పిటిషనర్
  • సమాజానికి ఉపయోగపడే అంశాలను కోర్టు ముందుకు తీసుకురావాలన్న ధర్మాసనం
  • ఇలాంటి అంశాలపై భావోద్వేగాలకు లోను కావాల్సిన అవసరం లేదని వ్యాఖ్య

జాతీయ పతాకంపై ఉండే అశోక చక్రంను ఎలా ప్రదర్శించాలనే దానిపై దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి అంశాలపై భావోద్వేగాలకు లోనుకావాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది.


వారణాసిలోని ఒక కూడలిలో ఏర్పాటు చేసిన అశోక చక్రాన్ని ఉదాహరణగా చూపుతూ సచిన్ గుప్తా అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తీరుపై ధర్మాసనం కొంత అసహనం వ్యక్తం చేస్తూ.. "సమాజానికి ఉపయోగపడే, నిర్మాణాత్మకమైన అంశాలను కోర్టు ముందుకు తీసుకురావచ్చు కదా" అని సూచించింది. మీ ఆలోచన మంచిదే అయినప్పటికీ, ఇలాంటి సాంకేతిక అంశాలపై తొలుత సంబంధిత అధికారులతో చర్చించాలని, వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని హితవు పలికింది.


ఇదే సందర్భంలో న్యాయవాది సచిన్ గుప్తా దాఖలు చేసిన మరికొన్ని పిటిషన్ల అంశం కూడా చర్చకు వచ్చింది. గతంలో ఆయన దాఖలు చేసిన 25 పిటిషన్లు ఆధారరహితంగా ఉన్నాయని కోర్టు భావించడంతో వాటిని ఆయన ఉపసంహరించుకున్నారు. తాజాగా ఆయన మరో 47 పిటిషన్లను దాఖలు చేయగా, వాటిలో అర్థరహితంగా ఉన్నవాటిని విత్‌డ్రా చేసుకోవాలని ధర్మాసనం సూచించింది. దీనికి అంగీకరించిన సచిన్ గుప్తా, కోర్టు అనుమతితో ఆ పిటిషన్లను వెనక్కి తీసుకుంటానని ధర్మాసనానికి తెలిపారు. "తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి ఇచ్చే గౌరవం" అంటూ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


Supreme Court of India
Ashoka Chakra
national flag
public interest litigation
court hearing
Justice Surya Kant
Sachin Gupta advocate
Varanasi
India

More Telugu News